V6 News

అయ్యో పాపం..! చెత్తకు నిప్పు.. జామాయిల్ దగ్ధం..10 ఎకరాల పంట అగ్గిపాలు

అయ్యో పాపం..! చెత్తకు నిప్పు.. జామాయిల్ దగ్ధం..10 ఎకరాల పంట అగ్గిపాలు

మరిపెడ(చిన్నగూడూరు), వెలుగు: చెత్తకు పెట్టిన నిప్పు ప్రమాదవశాత్తు పక్కనున్న తోటకు అంటుకోవడంతో భారీగా జామాయిల్​ దగ్ధమైంది. మరిపెడ మండలంలోని మేగ్య తండాకు చెందిన భూక్యా శంకర్ తన మొక్కజొన్న చేనులోని చెత్తకు నిప్పంటించి తగులబెట్టాడు. ఎండ తీవ్రతకు తోడు గాలి వేగంగా వీచడంతో మంటలు ఒక్కసారిగా పక్కనే ఉన్న భూక్యా బాషునాయక్​ జామాయిల్ తోటకు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు ఎగిసిపడి తోట మొత్తం కాలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాషు నాయక్ వాపోయాడు. కళ్లముందే చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతవడంతో రైతు గుండెలు బాదుకున్నాడు. అధికారులు స్పందించి నష్టపరిహారం అందించాలని కోరాడు.

8 ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధం

కారేపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గుంపెల్లగూడెం గ్రామ సమీపంలో ఆదివారం అగ్నిప్రమాదం వల్ల 8 ఎకరాల్లో మొక్కజొన్న పంట పూర్తిగా కాలిపోయింది. గుంపెల్లగూడెం గ్రామానికి చెందిన పాపారావు, వీరు, ఉపేందర్ మొక్కజొన్న సాగు చేశారు. పంట ఎండిపోయి కంకులను కోసి యంత్రంలో వేయడానికి సిద్ధంగా ఉంచారు. ఈ సమయంలో అగ్నిప్రమాదం జరగడంతో పంట దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది రైతులతో కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు. ఇతర పొలాలకు మంటలు వ్యాపించకుండా నియంత్రించారు. ఈ ఘటనలో సుమారు రూ.8 లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. మండల వ్యవసాయ అధికారి అశోక్‌కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.